బాపట్ల: నవంబర్ 26:-పెన్షన్ పొందుతున్న ప్రతి పెన్షనర్ నవంబర్ 30వ తేదీ లోపు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సూచించారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పక్షంలో డిసెంబర్ నెల నుండి పెన్షన్ నిలిపివేయబడే అవకాశముందని స్పష్టం చేశారు.బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మి పురలో ఉన్న బాపట్ల అసోసియేషన్ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన తన లైఫ్ సర్టిఫికెట్‌ను కూడా ఆన్లైన్‌లో సమర్పించి సంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా APRMSSS కు అనుబంధంగా ఉన్న అన్ని యూనియన్ లలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ చేపట్టినట్టు తెలిపారు. ఇంకా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.లైఫ్ సర్టిఫికెట్ సేవలతో పాటు మాజీ సైనిక సంక్షేమ సంఘాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తాండ్ర పేర్కొన్నారు. వాటిలో హెల్త్ కార్డులు, కాంటీన్ కార్డులు, దీర్ఘకాలిక పెన్షన్ సమస్యల పరిష్కారం, పిల్లల విద్యా భత్యాలు వంటి సేవలు ముఖ్యమన్నారు.పెన్షన్ సంబంధిత ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారైనా తమ జిల్లా యూనియన్ల ద్వారా రాష్ట్ర కమిటీని సంప్రదిస్తే, రాష్ట్ర కమిటీ టెక్నికల్ ఇన్‌చార్జి అడపా శంకర్ స్వయంగా వెళ్లి ఉచితంగా సేవలు అందించే ఏర్పాట్లు ఉన్నాయని హామీ ఇచ్చారు. వయోవృద్ధులు, అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన పెన్షనర్‌ల కోసం ఇంటి వద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ అందించే సేవలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్టా ఆదిశేషా రెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ కోశాధికారి షేక్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.బాపట్ల అసోసియేషన్ అందిస్తున్న సేవలను రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర ప్రత్యేకంగా అభినందించారు.










