
ప్రాణ త్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాల ఆవరణలో ఆదివారం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, అధికారులు, పుర ప్రముఖులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయులు శ్రీపొట్టి శ్రీరాములని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర సాధకుడిగా శ్రీపొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తమిళనాడులో మిలితమైన తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను గుర్తించడమే గాకుండా, విశేషంగా పోరాడిన గొప్ప యోధుడన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని 50 రోజులకు పైగానే ఆమరణ నిరాహార దీక్ష చేసిన గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలని చేపట్టిన పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు. మానవులకు సాధ్యం కాదేమో అనిపించేలా పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారని వివరించారు. సమాజంలో నేటి యువత ఆయన కృషిని గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్ రాజధానిగా 60 ఏళ్ళు గడిచిన తదుపరి మరో ఉద్యమం పైకి లేవడంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిందన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలోకి రానుందన్నారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించాలని పాఠ్యాంశాలలో ఉంచినప్పటికీ యువత గుర్తించలేక పోతుందన్నారు. తెలుగు రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాముల కావాలని ఆయన కోరారు.







