
బాపట్ల, తేది: 14-10-2025:రెవెన్యూ సంబంధిత సమస్యలను నాణ్యతతో పరిష్కరించేందుకు గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పనితీరును పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఇంచార్జి) మరియు డీఆర్ఓ శ్రీ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీఆర్వోల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పిజిఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) ద్వారా వస్తున్న వినతులను సమగ్రంగా, బాధ్యతతో పరిశీలించి, నిర్దిష్టంగా పరిష్కరించాలన్నారు. “వీఆర్వోలు విధుల్లో నిబద్ధతను కనబరిచి, ప్రజల సమస్యల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలి. పాత పద్ధతులు మార్చుకుని, ప్రజాసేవకు కొత్త దృక్పథంతో ముందుకెళ్లాలి,” అని ఆయన సూచించారు.ఐవీఆర్‌ఎస్ సర్వేలో ప్రజలు వ్యక్తం చేసిన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, సమస్యాత్మక వీఆర్వోలను పిలిపించి, అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రజలతో సంబంధం ఉన్న వ్యవహారాల్లో ఎలా స్పందించాలి, ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై కూడా శిక్షణ ఇచ్చామని వివరించారు”పునఃఘటనా సమస్యలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం. ఇకపై ఐవీఆర్‌ఎస్‌లో అదే విధంగా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఉపేక్షించేది లేదు,” అని హెచ్చరించారు. ప్రజల వినతుల పరిష్కారం అనంతరం వారికి తెలుగులో స్పష్టమైన ధృవీకరణ పత్రం ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో పిజిఆర్ఎస్ నోడల్ అధికారి లవన్న, సమగ్ర శిక్షా అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.







