
బాపట్ల, నవంబర్ 7 :-బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు సమకూరాయని ఎంపీ మరియు లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు.శుక్రవారం బాపట్ల మండలం గుడిపూడి గ్రామంలో రూ.2 కోట్లు నాబార్డ్ నిధులతో 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఎంపీతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ –

“బాపట్ల పార్లమెంట్ పరిధిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం నుండి రూ.6600 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రైల్వే, నేషనల్ హైవేలు, ఆక్వా ప్రాజెక్టులు, పర్యాటకాభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయి,” అని తెలిపారు.సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం రూ.95.52 కోట్ల నిధులు కేటాయించబడ్డాయని చెప్పారు.“ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది,” అని ఎంపీ పేర్కొన్నారు.తాజా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న గ్రామీణ రహదారులు, ఆర్‌అండ్‌బీ మరియు నేషనల్ హైవే రోడ్లను కూడా త్వరలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.గుడిపూడి – కర్లపాలెం రహదారి పనులు రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ వివరించారు.ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ –“బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం మన అందరి బాధ్యత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, ఎంపీ సహకారంతో అనేక సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి,” అన్నారు.రహదారుల అభివృద్ధికి సంబంధించి రూ.14.75 కోట్ల నిధులు తెచ్చినట్లు తెలిపారు.

“గుడిపూడి – యట్రావారిపాలెం తారు రహదారి రెండు నెలల్లో పూర్తవుతుంది. ఈ రోడ్డు నిర్మాణం రైతులకు, గ్రామస్థులకు ఎంతో మేలు చేస్తుంది,” అని చెప్పారు.అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రజలు సహకరిస్తే పనులు సకాలంలో పూర్తవుతాయని ఎమ్మెల్యే సూచించారు. ఎంపీ కృషితో పర్యాటక రంగానికి 95.52 కోట్ల నిధులు రావడం బాపట్లకు గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.







