
బాపట్ల:11-12-25:- పట్టణ అభివృద్ధికి కీలకమైన మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అవగాహన సాధస్సు బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రధాన అతిథిగా హాజరయ్యారు.పట్టణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఎమ్మెల్యే సమగ్రంగా వివరించారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను తీసుకుంటూ పారదర్శకంగా మాస్టర్ ప్లాన్ అమలు చేసే దిశగా కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, పట్టణ పెద్దలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే మౌలిక సదుపాయాలపై అధికారులు ప్రజలకు వివరాలు అందించారు.పట్టణ విస్తరణ, రహదారి అభివృద్ధి, డ్రైనేజ్ వ్యవస్థ సవరణ, వాణిజ్య–వసతి ప్రాంతాల గుర్తింపు వంటి ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రజలు తమ సమస్యలు, సూచనలు నేరుగా అధికారులకు తెలియజేసే వేదికగా ఈ సాధస్సు నిలిచింది.బాపట్ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రజల సహకారం అవసరమని, అన్ని వర్గాల సమన్వయంతో మాస్టర్ ప్లాన్‌ను విజయవంతం చేస్తామని అధికారులు తెలిపారు.







