
బాపట్ల: జనవరి :-పోలీస్ శాఖ పరిపాలనలో సాంకేతికతను సమర్థవంతంగా అమలు చేస్తూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో ఎంప్లాయి సర్వీస్ మాడ్యూల్స్ (ESM) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన తొలి జిల్లాగా బాపట్ల నిలిచిందని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు వెల్లడించారు.

శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ-ఆఫీస్ (e-Office) విధానంపై సమీక్షా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడారు. ప్రభుత్వ పరిపాలనలో భాగంగా అమలవుతున్న ఈ-ఆఫీస్ విధానం ద్వారా పోలీస్ శాఖ సేవల్లో పారదర్శకత, వేగం, సమర్థత మరింత పెరుగుతుందని తెలిపారు.
భవిష్యత్తులో పూర్తిగా పేపర్‌లెస్ విధానంలోనే అన్ని సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఈ ప్రక్రియలో డి.పి.ఓ (DPO) అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ-ఆఫీస్ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాలు, జిల్లా పోలీస్ కార్యాలయం అన్నీ ఒకే వేదికపై అనుసంధానం కాబోతున్నాయని చెప్పారు.

ఈ విధానం అమలుతో ఫైళ్ల కదలిక వేగవంతంగా జరిగి, పేపర్ వినియోగం పూర్తిగా తగ్గుతుందని, ఫైళ్ల గల్లంతు సమస్య ఉండదని వివరించారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు పెండింగ్ సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించగలుగుతారని పేర్కొన్నారు.Bapatla Local News
ESM విధానం ద్వారా సిబ్బందికి కావాల్సిన సెలవులు, సేవా అంశాలు అంతా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయని, దీని వల్ల సమయంతో పాటు కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. ఈ-ఆఫీస్ వ్యవస్థపై సిబ్బందికి త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ గారు వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఏఓ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ తదితర పోలీస్ అధికారులు, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.










