

బాపట్ల… రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ హెచ్చరించారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జిల్లాలోని పోలీసు అధికారులతో ఆయన జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులు నేరప్రవృత్తి విడనాడి సత్ప్రవర్తనతో సమాజంలో మెలగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, వారు ఏ నేరాలకు పాల్పడటంతో రౌడీ షీట్లు తెరవబడ్డాయి, వారిలో ఎంతమంది సత్ప్రవర్తనతో ఉన్నారు, ఎంతమంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముంది, వారి జీవన విధానం, ఎక్కడ నివాసముంటున్నారు, సత్ప్రవర్తన కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌కు వారు హాజరవుతున్నారా లేదా, హాజరుకాకుంటే కారణం ఏమిటి, ఆ సమయంలో వారు ఎక్కడ ఉన్నారు వంటి విషయాలను గురించి ఎస్పీ ఆరా తీశారు.
జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రశాంత వాతావరణం కల్పించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ముఖ్య కర్తవ్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు తమ స్టేషన్ల పరిధిలో ఉన్న పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. వారు గతంలో ఎటువంటి నేరాలకు పాల్పడ్డారు, ప్రస్తుతం వారి జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై దృష్టి సారించాలని తెలిపారు. వారు ఎటువంటి వ్యక్తులను కలుస్తున్నారు, వారికి ఏదైనా చరిత్ర ఉన్నదనే అంశాలను కూడా విశ్లేషించాలన్నారు. ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారు, లేదా పాల్పడే అవకాశం ఉందని ముందస్తు సమాచారం తెలిస్తే వెంటనే వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, వారు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా ముందస్తు చర్యలలో భాగంగా బైండోవర్ చేయాలన్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే షోకాజ్ నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పీ ఎం.డి. మోయిన్, రేపల్లె డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సీసీఎస్ డిఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్.బి., డిసిఆర్బి సిఐలు, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.







