మహిళలకు చీరల పంపిణీ
బాపట్ల పట్టణం 17వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ నాయకుడు మాసా కళ్యాణ్ చక్రవర్తి నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి, కమిటీ సభ్యులు 17వ వార్డు పరిధిలోని ప్రతి హిందూ కుటుంబాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, ఇంటింటికి వినాయకుని ప్రతిమలను అందజేశారు. బాపట్లలో ఇంతకు ముందెన్నడూ జరగని ఈ విధంగా వినాయకుని ప్రతిమలు పంచడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వినాయక చవితి రోజున మండపానికి విచ్చేసిన ప్రతి మహిళకు మనలి రాజా కుటుంబం తరఫున చీరలను పంపిణీ చేశారు. మనలి రాజా తనయురాలు జాహ్నవి స్వయంగా మహిళలకు చీరలు అందజేయడం విశేషం. భక్తులు మాట్లాడుతూ, మహిళలకు గౌరవం ఇస్తూ చీరలను పంచడం, అలాగే ఇంటింటికీ వినాయకుని ప్రతిమలను అందించడం శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ చేసిన ఒక గొప్ప సేవ అని అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కత్తుల మేఘనాథ్, దూళిపూడి నాగరాజు, విన్నకోట అశోక్, గంగు శిరీష్, గండికోట అంకమ్మ, భీమిరెడ్డి సూర్య, తదితరులు పాల్గొన్నారు.