GUNTUR NEWS: నగరపాలక సంస్థలోపారిశుద్ధ్య కార్మికుల నియామకం
GUNTUR COMMISSIONER STATMENT
గుంటూరులో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి ప్రస్తుతం ఉన్న కార్మికులకు అదనంగా కార్మికులు అవసరమన్నారు. కనుక రోజువారీ వేతనంపై కేటాయించిన ప్రాంతాల్లో కేటాయించిన పారిశుధ్య పనులు చేయడానికి ఆసక్తి ఉన్నవారు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే వార్డ్ ల వారీగా చెత్త తరలించడానికి 15 రోజులకు అద్దె ప్రాతిపదికన ట్రాక్టర్ లు అవసరమని ఆసక్తి కల్గిన ట్రాక్టర్ యజమానులు నగరపాలక సంస్థ కాల్ సెంటర్ లో నేరుగా, లేదా పైన తెలిపిన నంబర్ కి కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే డివిజన్లలో మైక్రో ప్యాకెట్స్ వారీగా కార్మికులను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని, ఉత్తర్వుల మేరకు కేటాయించిన వార్డ్ ల్లోనే కార్మికులు విధులు నిర్వహించాలన్నారు. అనధికార సూపర్వైజర్ల పేరుతో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు కూడా వారికి కేటాయించిన వార్డ్ ల్లో పారిశుధ్య పనులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. 24 గంటల్లో కేటాయించిన వార్డ్ ల్లో విధులకు హాజరుకాని ఎడల వారి స్థానంలో బదిలీ కార్మికులను ఆప్కాస్ లో రెగ్యులర్ గా నమోదు చేయడానికి సిఫార్స్ చేస్తామని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ లు తమ వార్డ్ ల్లో కేటాయించిన కార్మికులను మాత్రమే విధులు కేటాయించాలని, అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.