Site updated! Enjoy the latest version of CityNewsTelugu.

ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుదారులకు శుభవార్త… బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

కొత్త బార్ విధానం ప్రకారం బార్‌ల కేటాయింపులో పారదర్శకత పెద్దపీట
• బార్ లైసెన్స్ దరఖాస్తు రుసుము రూ. 5 లక్షలకు తగ్గింపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు వరంలా మారిందని, లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు లైసెన్స్ ఫీజును బార్ యజమానులు ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో వారికి ఆర్థికంగా లాభదాయకంగా మారనుందని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. గతంలో బార్ లైసెన్స్ దారులు ఫీజు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిరావడం వారికి ఆర్థికంగా భారమైందన్నది వాస్తవమన్నారు.                        
                బార్ లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపు దరఖాస్తుదారులకు గొప్ప వరమని, అంతేకాకుండా ఎక్కువ మంది దరఖాస్తుదారులను ఆకర్షించే అవకాశం కల్పిస్తుందన్నారు. ఉదాహరణకు కడపలో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ. 1.97 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించారు. అదేవిధంగా అనంతపురంలో లైసెన్స్ ఫీజు రూ. 1.79 కోట్ల నుండి రూ. 55 లక్షలకు, తిరుపతిలో రూ. 1.72 కోట్ల నుండి రూ. 55 లక్షలకు, ఒంగోలులో అంతకుమునుపు రూ. 1.4 కోట్ల నుండి రూ. 55 లక్షలకు తగ్గించడం జరిగిందన్నారు. అలాగే లైసెన్స్ దారులు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించారు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరులో బార్ లైసెన్స్ ఫీజు గతంలో రూ. 71 లక్షల ఉండగా రూ. 35 లక్షలకు తగ్గించారని వివరించారు.
             కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుము రూ. 5 లక్షలకు తగ్గించగా, అంతకుమునుపు విధానంలో తొంభై శాతం పట్టణ స్థానిక సంస్థల్లోని బార్లు రూ. 5 లక్షలకు మించి దరఖాస్తు రుసుము చెల్లించాల్సి వచ్చేదన్నారు. అంతకుమునుపు విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరులో 362 బార్లకు ప్రతి దరఖాస్తుకు రూ. 10 లక్షల దరఖాస్తు రుసుము ఉండేదని,  మదనపల్లె, చీరాల, బాపట్ల, ఒంగోలు వంటి చిన్న మునిసిపాలిటీలలో దాదాపు 399 బార్లకు దరఖాస్తు రుసుము రూ. 7.5 లక్షలు ఉండేదని,  ఇప్పుడు రాష్ట్రం అంతటా ఏకరూపంగా రూ. 5 లక్షల దరఖాస్తు రుసుము నిర్ధారించడం జరిగిందన్నారు.
             ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి బార్ లైసెన్సులను బహిరంగ లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. బార్ కార్యకలాపాలను లాభదాయకంగా మార్చేందుకు లైసెన్స్ ఫీజుని నిర్ణయించామని అన్నారు. యాభై వేల జనాభా వరకు ఉన్న పట్టణాలకు రూ. 35 లక్షలు, యాభై వేలకు మించి ఐదు లక్షల వరకు జనాభా ఉన్న చోట్ల రూ. 55 లక్షలు మరియు ఐదు లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాలకు రూ. 75 లక్షల ఫీజు నిర్ధారించామని, ఇది రిటైల్ ఎ4 షాపులతో పోలిస్తే 26% నుండి 48% వరకు తక్కువ అని తెలిపారు.
           మరొక ప్రధాన ఉపశమనం ఏమిటంటే, కొత్త వ్యాపారాలను మరియు వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి రెస్టారెంట్ తప్పనిసరి షరతుగా నిర్ణయించలేదన్నారు. ఇది పాత వ్యాపారవేత్తల గుత్తాధిపత్యాన్ని నిర్మూలించి ఎవరైనా ఈ విధానంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. దీంతో కొత్త దరఖాస్తుదారులను నూతన బార్ పాలసీ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నామన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker