
హైదరాబాద్:25-11-25:- ఎక్సైజ్ శాఖ ఖజానా నింపడానికి బార్ అండ్ రెస్టారెంట్లపై అనవసర భారాలు మోపుతుందంటూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నష్టాల్లో నడుస్తున్న బార్‌లపై ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీవో 145 కొత్త సమస్యలను సృష్టిస్తోందని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు.కొత్తగా జారీ చేసిన జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమీపంలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకొని అసోసియేషన్ బృందం నిరసన దీక్షకు దిగింది.

ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ—
అధికారుల తప్పిదాల వల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని మండిపడ్డారు. తమ వినతిపత్రాలపై స్పందించకుండా, తిరుగుగా తమపైనే కక్ష్యసాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.”సెప్టెంబర్ 30న మా లైసెన్స్ రీన్యూవల్ ఫీజుగా 40 లక్షలు చెల్లించాం. కానీ ఈ నెల 14న వచ్చిన జీవో ఆధారంగా అదనంగా 4 లక్షలు చెల్లించాలంటూ ఎక్సైజ్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. రీన్యూవల్ డేట్ తరువాత తీసుకువచ్చిన జీవోను కనీసం వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని కోరారు.అదేవిధంగా, బార్లను ఇతర ప్రదేశాలకు మార్చుకునే ఫీజు 16 లక్షల నుంచి 30 లక్షలకు పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. రెంటల్ అగ్రిమెంట్లలో రిజిస్ట్రార్ లీజ్ డీడ్‌ను తప్పనిసరి చేయకుండా సడలింపులు ఇవ్వాలని, అలాగే వైన్‌షాపులలో పర్మిట్ రూములు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని దామోదర్ గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.







