
బాపట్ల: సోమవారం 24:-అమరావతి బుద్ధిష్ట్ డెవలప్మెంట్ సర్క్యూట్‌లో భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రాన్ని చేర్చాలంటూ ది ఆది ఆంధ్ర నవ బుద్ధిష్ట్ సొసైటీ కార్యదర్శి, న్యాయవాది దోవా రమేష్ రాంజీ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. వినోద్ కుమార్‌కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అర్జీ సమర్పించారు.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2024–29 పర్యాటక పాలసీలో భాగంగా బౌద్ధ పర్యాటక క్షేత్రాల అభివృద్ధికి అమరావతి–విశాఖపట్నంను కేంద్రాలుగా తీసుకుని బౌద్ధ సర్క్యూట్ల రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో, పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో భట్టిప్రోలు పేరును విస్మరించడం బాధాకరమని ఆయన అలుగుపడ్డారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమరావతి, గుంటుపల్లి, ఉండవల్లి, నాగార్జునకొండతో పాటు కృష్ణా జిల్లాలోని ఘంటశాలకు ప్రాధాన్యం కల్పించిన ప్రభుత్వమే, అమరావతి–నాగార్జున కొండ క్షేత్రాల కంటే పురాతనమైన భట్టిప్రోలు బౌద్ధ స్థలాన్ని సర్క్యూట్‌లో చేర్చకపోవడం ఆశ్చర్యకరమని రమేష్ రాంజీ పేర్కొన్నారు.భట్టిప్రోలు అంశంపై జిల్లా పర్యాటక అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడం విచారకరమని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ తక్షణం స్పందించి, భట్టిప్రోలును పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల్లో చేర్చేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు సిఫార్సు నివేదిక పంపాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత బహుజన సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పర్రె కోటయ్య పాల్గొన్నారు.







