జీబీఎస్ పై ఆందోళన వద్దు
గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) సాధారణ వ్యాధేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. జీబీఎస్ తో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్లో చేరిన ఏడుగురిలో ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. శుక్రవారం జీజీహెచ్ కు వచ్చిన కృష్ణబాబు పరిస్థితిని సమీక్షించి, బాధితులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పదిమంది జీబీఎస్ ఆసుపత్రుల్లో ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి, కాకినాడ బోధనాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. బాధితుల్లో నరాలు బలహీనమై, పాదాల నుంచి పైకి చచ్చుబడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుంటాయని వివరించారు. ఇలాంటివి లక్షకు ఒకట్రెండు కేసులు వస్తున్నాయని చెప్పారు. పుణెలో ఒకే ప్రాంతంలో 140మందికిపైగా సోకడంతో కేంద్రం అధ్యయనం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితేమైనా ఉందా? అని పరిశీలించామని చెప్పారు. గత మూడు నెలల వివరాలు పరిశీలిస్తే ఎక్కడా అసాధారణ పరిస్థితి లేదన్నారు. బాధితులకు విలువైన ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్లు ఇస్తున్నామని, ఒక్కొక్కరి మీద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు ఎంత ఖర్చయినా వెనుకాడకుండా చికిత్స అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.