
హైదరాబాద్, అక్టోబర్ 15:-తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, అనంతరం రాజ్యాంగ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడారు.42 శాతం బీసీ రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించాలంటే రాజ్యాంగ సవరణ అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్రం వెంటనే లోక్‌సభ, రాజ్యసభలను సమావేశపరిచి బీసీ బిల్లును ఆమోదించి, రాష్ట్రపతి సంతకం తీసుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే ఈ రిజర్వేషన్లకు పూర్తి చట్టబద్ధత లభిస్తుందన్నారు.
ఈ డిమాండ్లను కొనసాగిస్తూ ఈ నెల 23న రాజ్‌భవన్ ముట్టడి, 25న ప్రజా సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని గౌడ్ ప్రకటించారు. అలాగే 26న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన, 28న రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.







