
విజయవాడ, ఫిబ్రవరి 3 (2026):-నిరుద్యోగ యువతకు ఉచితంగా జీఎస్టీ (GST) ఫైలింగ్ శిక్షణ అందించేందుకు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ (SAPF) మరియు ఆంధ్రప్రదేశ్ టాక్స్ బార్ అసోసియేషన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వ ‘జీరో పావర్టీ – P4’ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమంలో భాగంగా, ‘బంగారు కుటుంబం’ పథకం కింద ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
మంగళవారం లైలా కాలేజ్ ఆడిటోరియం ఎదురుగా ఉన్న వెంకటేశ్వర కాలనీలోని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు సమక్షంలో SAPF సీఈఓ జె. విజయలక్ష్మి, ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ, జీఎస్టీ ఫైలింగ్‌పై ఒక నెల రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువత ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.
శిక్షణ అనంతరం అభ్యర్థులు వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించిన నెలవారీ జీఎస్టీ రిటర్నులను ఫైల్ చేస్తూ స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.Vijayawada Localnews
ఈ కార్యక్రమంలో ఏపీ టాక్స్ బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్ కుమార్, ట్రెజరర్ ఫణి కుమార్, జీఎస్టీ ట్రైనర్ చక్ర రమణతో పాటు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.










