
హైదరాబాద్: 30-11-25:- రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాణాల అజయ్‌కుమార్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… బిజెపి బీసీల పక్షపాత పార్టీ అని, ఇప్పటి వరకు మూడు బీసీ వర్గానికి చెందినవారిని దేశ ప్రధానులుగా నిలబెట్టిందని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే కుల గణना ద్వారా ప్రతి వర్గానికీ వాటా వారికి చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మోడీ నాయకత్వానికి ప్రపంచ దేశాలు కూడా ఆకర్షితులవుతున్నాయంటూ ప్రశంసించిన కృష్ణయ్య… జనవరిలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఐదు లక్షల మంది బీసీలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, బీసీల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు.బీసీల సమస్యలపై డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.







