
విజయవాడ:నవంబర్ 08:-భవాని దీక్షల విరమణ నేపథ్యంలో, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.డిసెంబర్ 11 నుండి ప్రారంభమై డిసెంబర్ 15న మహా పూర్ణాహుతితో ముగియనున్న భవాని దీక్షల విరమణ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది భక్తులు అమ్మవారి దర్శనానికి రానున్నారని కమిషనర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ, క్యూలైన్లలో రద్దీ తగ్గింపు, స్నానఘాట్లు మరియు ప్రసాదం కౌంటర్ల వద్ద వేచి చూసే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో చేరేందుకు, అవసరమైన ప్రదేశాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటు అంశంపై చర్చించారు. అదేవిధంగా గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహన పార్కింగ్ ప్రాంతాలు మరియు భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు.భవాని దీక్ష విరమణ భక్తుల సౌకర్యార్థం గత సంవత్సరం రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆధునీకరించాలన్న కమిషనర్ సూచించారు. యాప్ ద్వారా అమ్మవారి దర్శన సమయాలు, ప్రసాదం ఆన్‌లైన్ బుకింగ్, పార్కింగ్ ప్రదేశాలు, మెడికల్ పాయింట్లు, త్రాగునీరు, సమాచార కేంద్రాలు, పూజా విధానం మొదలైన వివరాలు అందుబాటులో ఉండేలా చూడాలని దేవస్థాన ఐటీ అధికారులను ఆదేశించారు. దీని ద్వారా భక్తులు తక్షణ సమాచారం పొందడమే కాకుండా, తమ ప్రయాణాన్ని సులభంగా పూర్తిచేయగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీ కృష్ణకాంత్ పాటిల్ ఐపీఎస్, టెంపుల్ ఈఓ శ్రీ నానాయక్, ఎడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ శ్రీ దుర్గారావు, ఇన్స్పెక్టర్ గురు ప్రకాష్, దేవస్థాన ఐటీ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.







