విజయవాడ, అక్టోబర్ 16:విజయవాడ వాంబే కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి రావడాన్ని సిపిఎం ప్రజా పోరాట విజయంగా అభివర్ణించింది. అయితే, ప్రస్తుత డిజైన్‌లో ప్రతిపాదించిన 4-3 మీటర్ల పరిమాణం సరిపోదని, బస్సుల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి వెడల్పును కనీసం 10 మీటర్లకు పెంచాలని, ఎత్తు సరిచేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు నేడు వాంబే కాలనీ రైల్వే లైన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సెంట్రల్ సిటీ నాయకులు బి. రమణారావు, కే. దుర్గారావు, ఇతర ప్రజాసంఘాల నాయకులు టి. ప్రవీణ్, ఎస్.కే. పీర్ సాహెబ్, సిహెచ్ శ్రీనివాస్, రత్నకుమారి, బి. రాంబాబు, అప్పన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుత డిజైన్ ప్రజలకు అనర్ధమేఈ సందర్భంగా మాట్లాడిన బాబురావు మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా స్థానికులు, సిపిఎం కలిసి పోరాటం చేసిన ఫలితంగా ఈ అనుమతి వచ్చిందని ఇది నిజమైన ప్రజా విజయమే. కానీ 4-3 మీటర్ల పరిమాణంలో అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదు. గతంలో అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద నిర్మించిన సబ్ వే ప్రయోజనకరం కాకపోయింది. మళ్ళీ అదే తప్పు చేయకూడదు” అని అన్నారు.బస్సులకు, భారీ వాహనాలకు అనువుగా కనీసం 10 మీటర్ల వెడల్పుతో, ఎత్తు పెంచిన డిజైన్ రూపొందించాలని, తగిన నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాలాభిషేకాలు కాదు – నిర్మాణ పనులపై దృష్టి పెట్టండి“ప్రజాప్రతినిధులు పాలాభిషేకాలు, ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులు ప్రారంభించాలి. లేకపోతే సిపిఎం ఆందోళనలు కొనసాగుతాయి” అని సిపిఎం నేతలు హెచ్చరించారు.ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కనకదుర్గ వారధి నుండి నూజివీడు రోడ్డు వరకు వాహనాల రాకపోకలు సులభమవుతాయని, ప్రయాణ సమయం తగ్గి ప్రజాధనం ఆదా అవుతుందని వారు వివరించారు. నేటి ధర్నాలో వందలాదిగా స్థానికులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.