
విజయవాడ నగరంలో బుడమేరు వరద బాధితులకు సహాయం పేరుతో నగర కమిషనర్ రూ.9.23 కోట్లు పక్కదారి మళ్ళించారని దీనిపై సమగ్ర విచారణ జరపాలని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కడప మేయర్ కే సురేష్ బాబు సిడిఎంఏ ను కోరారు. మంగళవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి సంపత్ కుమార్ ను మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు వరదలకు చేసిన ఖర్చు వివరాలు తెలపాలని కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ప్రశ్న వేయగా.. ఎక్కడ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందో అని కౌన్సిల్ సమావేశాన్ని తప్పుదోవ పట్టించి కౌన్సిల్ జరగకుండా కమిషనర్ చేశారని ఆరోపించారు. కమిషనర్ చేసిన అవినీతిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. కమిషనర్ చేసిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రజల సొమ్మును తిరిగి కార్పొరేషన్ కు జమ చేయాలని వారు కోరారు.







