అమరావతి: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‌ఫ్లో 2.95 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3.37 లక్షల క్యూసెక్కులు నమోదు అయ్యాయి. నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో 2.52, ఔట్‌ఫ్లో 2.47 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 2.29, ఔట్‌ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులు వస్తున్నాయి. అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.94 లక్షల క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించగా, వినాయక నిమజ్జనాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇక గోదావరి నీటిమట్టం కూడా పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.3 అడుగులు, కూనవరం వద్ద 17.06 మీటర్లు, పోలవరం వద్ద 11.45 మీటర్లు నమోదు అయ్యాయి. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 6.59 లక్షల క్యూసెక్కులు నమోదయ్యాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.