
మచిలీపట్నం, జనవరి 30:-జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించడం జిల్లా గర్వకారణమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ జాకీర్ అహ్మద్ మార్గదర్శకత్వంలో కృష్ణా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే మొబైల్ యాప్‌ను రూపొందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 1000 ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమే ఎంపిక కాగా, అందులో ఒకటి కృష్ణా జిల్లా విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టు కావడం విశేషం. మరో ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా కుప్పిలకు చెందిన విద్యార్థులది.
ఈ ప్రతిభకు గుర్తింపుగా న్యూఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఈనెల 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఆహ్వానం లభించగా, విద్యార్థినులు జిల్లా సైన్స్ అధికారితో కలిసి న్యూఢిల్లీలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం జిల్లా విద్యాధికారి సుబ్బారావు మొవ్వ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు దావు స్నేహశ్రీ, కాకి సౌమ్యలను వెంటబెట్టుకుని జిల్లా కలెక్టర్‌ను నగరంలోని ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.Krishna district news local Telugu: కృష్ణా జిల వార్తలు
ఈ భేటీలో విద్యార్థినులకు మార్గదర్శకత్వం వహించిన జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ జాకీర్ అహ్మద్‌తో పాటు విద్యార్థినులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకుని, మరింత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.










