
మంగళగిరి :13-11-25:- మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంటీన్‌లో వర్కర్లకు నాసిరకం భోజనం అందిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాల లోపం, పెరిగిన పని భారం కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయని వారు ఆరోపిస్తున్నారు.గురువారం కంపెనీ మెయిన్ గేటు వద్ద కార్మికులు నిరసన చేపట్టి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు నాగళ్ల శ్రీధర్, గౌరవాధ్యక్షుడు రఘుపతుల రామ్మోహనరావు, ప్రధాన కార్యదర్శి వలివేటి ఆదినారాయణ మాట్లాడుతూ
“గత ఆరు నెలల క్రితమే నాసిరకం ఆహారం, భద్రతా లోపాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ప్రతిరోజు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రొడక్టివిటీ మీటింగ్‌లలో కూడా సమస్యను ప్రస్తావించినా యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది” అన్నారు.కార్మికులు మాట్లాడుతూ “సరైన ఆహారం, శుభ్రమైన వాతావరణం లేకుండా ఎలా పనిచేయగలం?” అని ప్రశ్నించారు. ప్రారంభంలో 250 మంది ఉన్న యూనిట్‌లో వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా వందమందిని తగ్గించడంతో ప్రస్తుతం కేవలం 150 మంది ఉద్యోగులపై భారీ పని ఒత్తిడి పడిందని వారు వివరించారు. ముగ్గురు చేయాల్సిన పనిని ఇద్దరితో చేయించడంతోపాటు అదనపు పనులు మోపుతున్నారని ఆరోపించారు.మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే అనేక ప్రమాదాలకు కారణమైందని కార్మికులు తెలిపారు. ఐటీఐ ఫ్రెషర్లను సరైన శిక్షణ లేకుండానే యంత్రాలపై పనిచేయించడంతో పలువురు గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఒకరికి కాలు కాలిపోవడం, మరొకరికి వేలి నరాలు తెగడం వంటి సంఘటనలను యాజమాన్యం బయటకు రానివ్వకుండా దాచిపెడుతోందని విమర్శించారు.క్యాంటీన్‌లో శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సెలవుపై ఉన్న సిబ్బందికి బదులు అనుభవం లేని ఫ్రెషర్లను బలవంతంగా పనిలోకి దింపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.“అనేకసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. ఇప్పుడు పరిస్థితి బ్రిటిష్ పాలన మాదిరిగా మారింది. మానవత్వం లేకుండా ఒత్తిడి పెడుతున్నారు” అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణ చర్యలు తీసుకుని క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారం అందించాలి, పని భారం తగ్గించాలి, భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి, గాయపడిన వారికి పరిహారం చెల్లించాలి అని వారు డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.







