
మచిలీపట్నం: నవంబర్ 29:-కృష్ణా జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. గత సమావేశంలో రూ.24.37 కోట్ల అంచనాలతో 424 పనులకు అనుమతులు ఇచ్చినప్పటికీ, వాటిని ఇటీవల జెడ్పీ సీఈవో కన్నామ నాయుడు ఏకపక్షంగా నిలిపివేయడం, సభ్యుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.సీఈవో నిర్ణయాలు తమకు తెలియజేయకపోవడమే కాకుండా, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికపై అవమానకరమైన పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ, జడ్పీటీసీలు, ఎంపీపీలు పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు.
జడ్పీ పాలకవర్గ ఆమోదం లేకుండా వందలాది పనులను రద్దు చేయడం మాత్రమే కాకుండా,
“చైర్‌పర్సన్ అన్నది కేవలం కాపల కుక్క వంటి పదవి… అన్ని నిర్ణయాలు సీఈవో తీసుకుంటాడు”
అనే విదంగా రాజ్యాంగ దినోత్సవం రోజునే అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు సీఈవోపై వెల్లువెత్తాయి.ఈ వ్యాఖ్యలపై మండిపడిన సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“ఇలాంటి పరుష పదజాలం వాడిన అధికారి కొనసాగడం సమంజసం కాదు… వెంటనే సస్పెండ్ చేయాలి” అని జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు.జిల్లా పరిషత్ సభ్యులు ప్రతిపాదించిన పనులను పరిశీలించకుండా, చైర్‌పర్సన్, సభ్యులకు తెలియజేయకుండానే రద్దు చేసిన జడ్పీ సీఈవోపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.







