
మంగళగిరి, నవంబర్ 4: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు చర్మకారుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బుల్లా రాజారావు మాట్లాడుతూ, తాము మంత్రి లోకేష్‌ను కలిసిన ఫోటోలు ఆలస్యంగా అందడం వల్ల గురువారం మీడియాలో వివరాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని చర్మకారుల అభివృద్ధి కోసం లిడ్ క్యాప్‌కు రూ.300 కోట్లు మంజూరు చేయాలని, 300 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, అన్ని జిల్లాల్లో లెదర్ పార్కులు నిర్మించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా చర్మకారులు, డప్పు కళాకారులకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, చర్మకారుల సంక్షేమానికి నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న తన సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం తనకు ‘పద్మశ్రీ’ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేయాలన్న అంశాన్ని కూడా వినతి పత్రంలో పొందుపరిచినట్లు చెప్పారు.తమ అభ్యర్థనలకు మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారని బుల్లా రాజారావు తెలిపారు.







