
బాపట్ల : 05-12-2025;-బాపట్ల జిల్లాలో దత్తత ప్రక్రియను పూర్తిగా చట్టపరమైన విధానంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాల్లో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులను చట్టబద్ధంగా దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలను దత్తత కోరే తల్లిదండ్రులు తప్పనిసరిగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (CARA) పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. పెళ్లి అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో పిల్లలు లేని దంపతులు దత్తతకు అర్హులవుతారని చెప్పారు. కారా పోర్టల్‌లో తల్లిదండ్రుల స్తోమత, ఆరోగ్య వివరాలు, పిల్లల వయసు–లింగం వంటి అభిరుచులను నమోదు చేస్తారని, సీనియారిటీ ప్రకారం దత్తత కేటాయింపు జరుగుతుందని వివరించారు.బెంగళూరు, చెన్నైకు చెందిన దత్తత తల్లిదండ్రులకు కారా తాజా మార్గదర్శకాల ప్రకారం చిన్నారులను అధికారికంగా దత్తత ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఏర్పడిన తర్వాత ఇది మొదటి దత్తత కార్యక్రమం కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పిల్లల కోసం ఆశిస్తున్న దంపతులు మిషన్ వాత్సల్య పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి ప్రభుత్వం చట్టబద్ధ దత్తత అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు.కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారిణి డి. రాధా మాధవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సిపిఒ పురుషోత్తమరావు, శిశు గృహ మేనేజర్ రోజిలిన్, దత్తత తల్లిదండ్రులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.







