
అమరావతి: చెన్నై సెంట్రల్:–విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గంలో సర్వీసు త్వరలో ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరే వందేభారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుతుంది. ఇకపై పొడిగించిన సర్వీసు ప్రకారం రైలు 11.45కి విజయవాడ చేరుకొని, 11.50కి బయలుదేరి మధ్యాహ్నం 12.25కి గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50కి నరసాపురం నుంచి బయలుదేరి, 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుతుంది. అక్కడి నుంచి 4.55కి బయలుదేరి, తెనాలి (5.20), ఒంగోలు (6.30), నెల్లూరు (7.40), గూడూరు (8.50), రేణిగుంట (9.50) మీదుగా రాత్రి 11.45కి చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.పొడిగించిన ఈ సర్వీసుకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించామని, నరసాపురం స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వందేభారత్‌ను ప్రారంభిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.రఘురామ లేఖ.. శ్రీనివాసవర్మ చొరవనరసాపురం మీదుగా వందేభారత్ సర్వీసు పొడిగించాలని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఆ ప్రతిపాదనను ప్రస్తుత నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రాధాన్యంగా తీసుకొని ప్రత్యేకంగా కృషి చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.







