నంద్యాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో “స్నేహపూర్వక న్యాయ సేవల పథకం–2024” పై బుధవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ, సమాజంలోని పిల్లల సంరక్షణ, రక్షణ బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం దక్కేలా చూడాలన్నారు.
లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రిసోర్స్ పర్సన్, కర్నూలు డిజేబులిటీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రైస్ ఫాతిమా చెప్పారు.
నంద్యాల అడిషనల్ డీఎంహెచ్‌ఓ శారదాబాయి మాట్లాడుతూ, అవసరమైన పిల్లలకు చికిత్సలు, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ తెలిపారు. సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేయవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిసోర్స్ పర్సన్ రైస్ ఫాతిమా, నంద్యాల అడిషనల్ డీఎంహెచ్‌ఓ శారదాబాయి, ఐసీడీఎస్ పీడీ విజయ తదితరులు పాల్గొన్నారు.