
బాపట్ల:- పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఈనెల 8వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి చేతుల మీదుగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారు.
శిబిరంలో పాల్గొనే ప్రజలకు నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించనున్నారు. అలాగే అవసరమైన వారికి ఉచిత శస్త్ర చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.bapatla news
అదేవిధంగా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ డిఆర్డిఏ–సెర్ఫ్ సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి రుణాలను సబ్సిడీపై అందజేయనున్నారు. కొంతమంది లబ్ధిదారులకు వాహనాలను కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, మహిళలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని స్థానిక నాయకులు పిలుపునిచ్చారు.







