
మచిలీపట్నం:నవంబర్ 25:-కృష్ణా జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న అజయ్‌కుమార్‌పై క్రమశిక్షణారాహిత్యం ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ వేడుకలో అశ్లీల నృత్యం చేసిన ఘటనపై ఆయనను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వ ఉద్యోగిగా, పోలీసు శాఖ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అజయ్‌కుమార్ ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన డీజే పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల సమక్షంలో అసభ్యకరంగా నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో అధికార వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
వీడియోను గమనించిన అనంతరం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదికను పరిశీలించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హోంగార్డు క్రమశిక్షణ ఉల్లంఘించాడని నిర్ధారించారు. పోలీసుల గౌరవం, యూనిఫామ్ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు.దీంతో అజయ్‌కుమార్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ జిల్లా పోలీసు శాఖ అధికారికంగా ఆర్డర్లు జారీ చేసింది.







