
ఏలూరు జిల్లా:చింతలపూడి: అక్టోబర్ 14:-ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు లభించకపోవడం, 15 నెలల పీఎఫ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడంపై నిరసనగా ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ శాఖ అధ్యక్షురాలు తొర్లపాటి మరియమ్మ మీడియాతో మాట్లాడుతూ, “కొత్త ఏడాది ప్రారంభంలో కాంట్రాక్టర్ మారాలని పేర్కొనబడినప్పటికీ మళ్లీ అదే కాంట్రాక్టర్‌కే టెండర్ ఇవ్వడం అన్యాయమని” ఆరోపించారు. పాత బకాయిలను విడుదల చేయకుండానే మళ్లీ అదే వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడం వెనుక జిల్లా వైద్యాధికారుల ప్రమేయం ఉందని ఆమె మండిపడ్డారు.
“మూడు నెలల జీతాలు, 15 నెలల పీఎఫ్ బకాయిలు కార్మికుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. వెంటనే బకాయిలు విడుదల చేసి, బాధ్యతాయుతంగా వ్యవహరించని కాంట్రాక్టర్‌ను మార్చాలి,” అంటూ ఆమె ప్రభుత్వాన్ని, వైద్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో కార్మికులు రాజు, నాగరాజు, కుమారి తదితరులు పాల్గొన్నారు. అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.







