
బాపట్ల:29-11-25:- ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీఎస్ ఆదేశాలతో, చీరాల డీఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో, శక్తి టీమ్ ఎస్సై హరిబాబు, కానిస్టేబుళ్లు కె. సుబ్బారావు, సునీత కలిసి వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని వివేకానంద హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.పిల్లలు, బాలికలు, యువత భద్రతను దృష్టిలో ఉంచుకొని శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానం, మహిళా భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అధికారులు వివరించారు. అకస్మాత్తుగా ఎదురయ్యే వేధింపులు, ప్రమాదాలు, ఇతర అత్యవసర సందర్భాల్లో శక్తి యాప్ ఎంత ముఖ్యమో పాఠశాల విద్యార్థులకు ప్రదర్శనలతో చెప్పి చూపించారు.

అదేవిధంగా, “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను పోలీసులు విద్యార్థులకు వివరించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని అధికారులు హెచ్చరించారు. చీరాల పట్టణంలో డ్రగ్స్‌పై నిఘాను మరింత బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో పోక్సో చట్టం పై కూడా విపులంగా అవగాహన కల్పించారు. బాలలపై లైంగిక నేరాలకు విధించే కఠిన శిక్షలు, వేధింపులకు గురైతే వెంటనే పోలీసులకో, శిశు సంరక్షణ కమిటీకి ఫోన్ చేసి తెలియజేయాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. బాలికలతో పాటు బాలుర రక్షణ కూడా ఈ చట్టం ద్వారా సమానంగా లభిస్తుందని గుర్తు చేశారు.“సాంకేతిక యుగంలో పిల్లలు, మహిళల భద్రత అత్యంత ముఖ్యమైనది. శక్తి యాప్‌ను ప్రతి మహిళ తెలుసుకోవాలి. డ్రగ్స్‌ను సమాజం నుండి నిర్మూలించాలంటే కుటుంబాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. పోక్సో చట్టంపై అవగాహన ఉండటం పిల్లల రక్షణకు కీలకం” అని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు మహిళా భద్రత, మాదకద్రవ్య నిషేధం, బాలల రక్షణ చట్టాలపై పోలీసు శాఖ చేసే కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొడ్డు హరిబాబు, బి. లక్ష్మీ కనకదుర్గ, ఎస్‌కె. నౌషాద్‌తో పాటు చీరాల సబ్‌డివిజన్ శక్తి టీం సభ్యులు ఎస్సై హరిబాబు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, సునీత పాల్గొన్నారు.







