గుంటూరు:20 09 25:-చిరు వ్యాపారులకు ఆర్థిక ఊరట కలిగించే దిశగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఖిద్మత్ కో-ఆపరేటివ్ సొసైటీ సామాజికంగా ఎంతో ఉపయోగకరమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీ ఖానాలో జరిగిన లోన్ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“అధిక వడ్డీ రుణాల ఊబిలో ఉన్న చిన్న వ్యాపారులకు వడ్డీరహిత రుణాలు అందించడం గొప్ప ప్రయత్నం. ఖిద్మత్ సొసైటీ పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డ్వాక్రా రుణాల మాదిరిగా, సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం,” అని పేర్కొన్నారు.
ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే తమ ఆశయమని ఎమ్మెల్యే తెలిపారు.
“ఈ తరహా సహకార బ్యాంకులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రారంభించేందుకు నేను కృషి చేస్తాను,” అని ఆమె హామీ ఇచ్చారు.
ఖిద్మత్ సొసైటీ 47 బ్రాంచ్లతో ప్రజల వద్దకు చేరుతున్న విధానం ప్రశంసనీయం, అని పేర్కొంటూ, నిర్వహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, హజ్ కమిటీ చైర్‌పర్సన్ హసన్ బాషా, ఖిద్మత్ కో-ఫౌండర్ సిద్ధిఖీ, ఫైనాన్స్ కార్పొరేషన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సొసైటీ విస్తరణ, సామాజిక బాధ్యతపై వారు వివరంగా మాట్లాడారు.