మంగళగిరి, అక్టోబర్ 7: స్వచ్ఛ ఆంధ్ర–2025 అవార్డుల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్వచ్ఛ ఎంటీఎంసీగా ఎంపికైన మంగళగిరి మున్సిపాలిటీకి ఈ ఘనత దక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును కమిషనర్ అలిమ్ భాషా స్వీకరించారు. ఇదే కార్యక్రమంలో, జిల్లాస్థాయిలో ఉత్తమ హాస్పిటల్‌గా ఎంపికైన గణపతి నగర్ ఇందిరానగర్ యూపీహెచ్సీకి జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ. తమీమ్ అన్సారియా అవార్డును అందజేశారు.
ఈ సందర్భంగా మంగళవారం టీడీపీ నాయకులు వీరికి ప్రత్యేకంగా సన్మానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెదవడ్లపూడి గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, నాయకులు అలిమ్ భాషా కు శాలువా కప్పి, పూల మొక్కను అందజేశారు. అనంతరం గణపతి నగర్ యూపీహెచ్సీలో డాక్టర్ పీ. అనూష ను సత్కరించారు.
ఈ సందర్భంగా అన్నే చంద్రశేఖర్ మాట్లాడుతూ, మురికివాడలతో విస్తరించి ఉన్న మంగళగిరిలో పరిశుభ్రత పరంగా ఉన్నత సేవలందించిన కమిషనర్ అలిమ్ భాషా కృషి ప్రశంసనీయమని చెప్పారు. అలాగే, కేవలం మూడున్నర సంవత్సరాల సమయంలోనే ఇందిరానగర్ హెల్త్ సెంటర్‌కు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్ రావడానికి కృషి చేసిన డాక్టర్ అనూష సేవలు పరిగణనీయమని కొనియాడారు.
ఆమె పరిశుభ్రత విషయంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో పాటు మూడు సంవత్సరాల్లో ముగ్గురు కలెక్టర్లు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నదీ అరుదైన ఘనత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే నంద కిషోర్, బోయపాటి రమేష్, రంగిశెట్టి పెద్దబ్బాయి, హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.