
విజయవాడ, అక్టోబర్ 19:దీపావళి వేడుకలతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ రోజు (19.10.2025) ఎన్.టి.ఆర్. జిల్లా నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్ గారు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసెంట్ రోడ్ ప్రాంతం, భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నమిఘాట్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్న బందోబస్త్ పనులను సమీక్షించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ — ముఖ్యమంత్రి బీసెంట్ రోడ్‌లో వ్యాపారస్తులతో మాట్లాడిన అనంతరం పున్నమిఘాట్‌లో జరిగే దీపావళి సంబరాలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వి.ఐ.పీలు, అధికారులు పాల్గొననున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పార్కింగ్ ప్రదేశాలు, మార్గదర్శక సూచనలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పౌరుల ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీ ఎస్.వి.డి. ప్రసాద్, ఏడీసీపీ శ్రీ జి. రామకృష్ణ, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







