
బాపట్ల: బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన రూ.14,70,616 విలువైన చెక్కులను 25 మంది అర్హులైన లబ్ధిదారులకు శనివారం బాపట్లలో పంపిణీ చేశారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేసి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృక్పథానికి ఇది నిదర్శనం,” అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడంపై ప్రాధాన్యతనివ్వడం, ప్రత్యేకంగా వైద్య ఖర్చులతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తక్షణ సహాయం అందిస్తున్నట్టు చెప్పారు.
మధ్యతరగతి మరియు పేద కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి అత్యంత ఉపయుక్తమైందని, మరింత మంది అర్హులైన లబ్ధిదారులు ఈ నిధికి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. “సహాయం మరింత మందికి అందేలా ప్రభుత్వంగా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తాము,” అన్నారు.







