
Tirupati:శ్రీహరికోట;02-11-25:-భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ‘సీఎంఎస్-03’ ఉపగ్రహాన్ని మోసుకున్న ‘ఎల్బీఎం3-ఎం5’ రాకెట్ శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఖచ్చితంగా లెక్కించిన మార్గంలో సాగి, జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో) లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో ఇస్రో మరోసారి తన సాంకేతిక సామర్థ్యాన్ని చాటుకుంది.ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది. భారత భూభాగం నుంచి ఈ కక్ష్యలోకి పంపిన శాటిలైట్లలో ఇది ఇప్పటివరకు అత్యంత బరువైనది.
సీఎంఎస్-03, లేదా జీశాట్–7ఆర్ పేరుతో కూడా పిలవబడే ఈ ఉపగ్రహం ప్రధానంగా భారత నౌకాదళ అవసరాల కోసం రూపుదిద్దుకుంది. సముద్ర జలాల్లో మోహరించిన యుద్ధనౌకలు, జలాంతర్గాములు మరియు భూ నియంత్రణ కేంద్రాల మధ్య భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది అందిస్తుంది.సముద్ర వాతావరణ పరిస్థితులు, నౌకా చలనం, సమాచార మార్పిడి వ్యవస్థలో ఈ ఉపగ్రహం కీలకపాత్ర పోషించనుంది. 2013 నుంచి సేవలందిస్తున్న జీశాట్–7 స్థానంలో దీన్ని ప్రతిస్థాపించారు.ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మరోసారి భారత అంతరిక్ష రంగం ప్రతిష్టాత్మక పుట రాసుకుంది.







