
అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
జిల్లాలో యూరియాను నిరంతరం రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుందనే విషయాన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు స్పష్టంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై వ్యవసాయాధికారులతో గురువారం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా రైతులు రబీ అవసరాలకు కూడా ఇప్పటినుండే యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, దారి మళ్లించినా, అధిక ధరలకు అమ్మినా అట్టి డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వ్యవసాయాధికారులు గ్రామ స్థాయి అధికారుల వరకు అందరూ రైతుల యూరియా అవసరాలను గుర్తించి దఫా, దఫాలుగా వారికి సరఫరా చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఎప్పుడూ సంవత్సరం పొడుగునా ఎరువులు నిల్వలు సరఫరా అవుతాయని చెప్పారు. యూరియా తాడేపల్లిగూడెం రేక్ పాయింట్ నుండి రేక్ ఆఫీసర్ వారు జాగ్రత్తగా మండలాలకు, గ్రామాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
యూరియా సరఫరాపై తప్పుడు వదంతులు వ్యాప్తి చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం రైతులకు యూరియాను అందుబాటులో ఉంచిన వివరాలను రైతులకు వ్యవసాయాధికారులు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండు వేల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం నుండి 500 టన్నుల యూరియా ఏలూరు జిల్లాకు కేటాయించడం జరిగిందని, అదికూడా రేపు సాయంత్రం డీలర్లకు లారీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతులందరికీ ఎరువులు అవసరమైన ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని, మోతాదుకు మించిన ఎరువులు రైతులు వినియోగించకుండా, ఎరువుల అధిక వినియోగం వలన కలిగే అనర్దాలను రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కలిగించాలని వ్యవసాయాధికారులు కలెక్టర్ ఆదేశించారు. కల్తీ ఎరువుల బారిన రైతులు పడకుండా గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేసి బిల్లులను తప్పనిసరిగా అడిగి తీసుకొవాలని రైతులకు తెలియజేయాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.







