
అర్జీదారులకు కడుపునిండా భోజనం పెట్టడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, అన్నారు.

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరైన అర్జీదారులకు రెడ్ క్రాస్, కలెక్టరేట్ ద్వారా కలిసి ఉచితంగా భోజనం అందిస్తున్న కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. 180 అర్జీలు రాగా, వారితో పాటు వచ్చిన ఇద్దరు, ముగ్గురికి భోజనం అందించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ప్రశంసించారు. కలెక్టరేట్ నుండి అందిస్తున్న ఆర్థిక సహాయం ద్వారానే రెడ్ క్రాస్ సమస్త ఉచిత భోజనాన్ని కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నామన్నారు. భోజన పదార్థాలను పరిశీలించారు. కడుపునిండా అన్నం పెడుతున్నారా అంటూ... భోజనం చేస్తున్న అర్జీదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. చాలినంత వడ్డిస్తున్నారా, అన్నం, కూరలు రుచిగా ఉంటున్నాయా... అని ఆరా తీశారు. ఏ ప్రాంతాల నుంచి అర్జీ ఇవ్వడానికి వచ్చారు అంటూ పలువురుని అడిగి తెలుసుకున్నారు. వడ్డిస్తున్న ఆహార నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. అక్షయపాత్ర నుంచి తెప్పించిన నాణ్యమైన, రుచిగల ఆహారాన్ని అర్జీదారులకు ఇస్తున్నామని రెడ్ క్రాస్ సంస్థ జిల్లా అధ్యక్షులు నారాయణ బట్టు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రతి ఆదివారం 300 నుంచి 400 మంది వరకు ఉచితంగా భోజనం పెడుతున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామని వివరించారు. ప్రజల కోసం రెడ్ క్రాస్ సంస్థ మున్ముందు ఇలానే పని చేయాలని కలెక్టర్ సూచించారు.
కడుపునిండా భోజనం పెట్టారయ్యా..
సంసోను, కారుమూరివారిపాలెం గ్రామం, చుండూరు మండలం.
స్థలం సమస్య చెప్పుకోవడానికి చుండూరు నుంచి వచ్చాము. అర్జీ ఇచ్చి వెళ్దామని అనుకున్నా... నాకు షుగర్ ఉంది. ఆకలి వేసి ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఉచిత భోజనం ఉంది... తిని వెళ్ళండి అని రెడ్ క్రాస్ వాళ్ళు చెప్పారు. వెంటనే అక్కడికి వచ్చి అన్నం పెట్టించుకుని తిన్నాను. కడుపునిండా పెట్టారు. బాగా రుచిగా ఉంది. మీరు చల్లగా ఉండాలని కలెక్టర్ దీవించారు.
భోజనం బాగుందయ్యా..
ఏసు కుమారి చుండూరు మండలం
మా పొలం సమస్య చెప్పుకోవడానికి వచ్చాను. అర్జీ ఇచ్చాక ఇంటికి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది. హోటల్ కి వెళ్తే బోలెడని డబ్బులు అవుతాయి. ఏం చేయాలో తోచిన పరిస్థితులు. ఎక్కడ భోజనం చేయండి అని కలెక్టరేట్ సిబ్బంది చెప్పారు. భోజనం చాలా బాగుంది. రూపాయల లేకుండానే ఉచితంగా భోజనం పెట్టారు. ఇది ఎంతో బాగుంది.
చాలా రుచిగా ఉంది.
గంగాధర్, కర్లపాలెం
అర్జీ ఇవ్వడానికి వచ్చే పేదలందరికీ ఉచితంగా భోజనం పెట్టడం చాలా బాగుంది. ఉచిత ఆహారమైనప్పటికీ అన్నం కూరలు అన్ని చాలా రుచిగా ఉన్నాయి. పేదలను కనికరించడం సంతోషంగా అనిపించింది.
అన్ని ఉచితంగానే
కొప్పు వెంకటేశ్వరరావు, నగరం మండలం
అర్జీ ఇవ్వడానికి వస్తే ఉచితంగానే భోజనం పెట్టారు. చాలా రుచిగా ఉంది ఇంట్లో తిన్నట్టుగానే తృప్తిగా తిన్నాను. భోజన పదార్థాలన్నీ ఉచితంగానే అందించారు. చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు నూరేళ్లు చల్లగా ఉండాలి.
ఆయన వెంట రెడ్ క్రాస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.







