ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ కఠిన హెచ్చరిక||Collector’s Strict Warning on Public Grievance Resolution
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ కఠిన హెచ్చరిక
ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన, నాణ్యతతో పరిష్కరించాల్సిందిగా సూచించారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈరోజు వేదిక ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 268 ఫిర్యాదులు స్వీకరించామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులపై పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో పరిశీలించి సరైన జవాబు దారితనంతో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించిన ఫిర్యాదులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ధృవీకరించిన అనంతరం మాత్రమే ముగించాలని సూచించారు.
అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యతతో పరిష్కరించాలి, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా అందిన కొన్ని ఫిర్యాదులు —
చింతలపూడి మండలానికి చెందిన దాసరి సురేష్‌కుమార్ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ద్వారకా తిరుమండలానికి చెందిన పిండి ఎలీషా తన భూమిపై పేరు నమోదు చేసి పట్టాదారు పాసుబుక్ ఇవ్వాలని అభ్యర్థించారు. దెందులూరు మండలానికి చెందిన వడ్లపట్ల వెంకటేశ్వరరావు బెల్ట్ షాపులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కామవరపుకోట మండలానికి చెందిన వానరాశి లక్ష్మీరాజ్యం పంట పొలానికి వెళ్లే దారిపై ఆక్రమణ తొలగించాలన్నారు. జీలుగుమిల్లి మండలానికి చెందిన వారా వెంకటేశ్వరరావు రహదారి విస్తరణలో కోల్పోయిన ఇంటి భాగానికి సరైన పరిహారం ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.