ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23 నుంచి||CPI AP 28th State Conference from August 23 in Ongole
ఒంగోలులో సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23 నుంచి
సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంలో సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 23 నుండి 25 వరకు ఒంగోలు నగరంలో ఘనంగా జరగనున్నాయి. ఈ వివరాలను సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. సోమవారం ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు.
కృష్ణ చైతన్య మాట్లాడుతూ, సిపిఐ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటికే గ్రామ, వార్డు, పట్టణ, మండల, నియోజకవర్గ స్థాయి మహాసభలు పూర్తయ్యాయని తెలిపారు. ఈసారి రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతుండటం విశేషమని పేర్కొన్నారు. మహాసభలు నిర్వహణకు అధిక వ్యయం కావడంతో పార్టీ అభిమానులు, ప్రజలు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆగస్టు 23న ఒంగోలు నగరంలో వేలాదిమంది పాల్గొనే ప్రజా ప్రదర్శన, బహిరంగ సభతో మహాసభలు ప్రారంభమవుతాయని, ఏలూరు జిల్లా నుంచి సుమారు 1000 మంది సిపిఐ శ్రేణులు పాల్గొననున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ, తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితర ప్రముఖ నాయకులు హాజరవుతున్నారని చెప్పారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో వందలాది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారని వివరించారు.
ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ, ఆగస్టు 23న వందలాది రెడ్ షర్ట్ వాలంటీర్లతో అగ్రభాగాన కవాతు నిర్వహించనున్నామని తెలిపారు. మహాసభ విజయవంతం కోసం ప్రజల సహకారం కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, పుప్పాల కన్నబాబు, భజంత్రీ శ్రీనివాసరావు, కనకం జగన్, ఏ. త్రిమూర్తి తదితరులు పాల్గొన్నారు.