
విజయవాడ, అక్టోబర్ 12:సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన తెలుగు సినీ గాయకుడు, నటుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్ర అభిమాని సంఘ అధ్యక్షుడు, సీనియర్ అభిమాని సుధా స్వామి కీలక విజ్ఞప్తి చేశారు.

శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఐదు రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా స్వామి మాట్లాడుతూ – “సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపూర్వమైనవి. ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ద్వారా భారత ప్రభుత్వం అతనికి తగిన గౌరవం అర్పించినవారవుతారు,” అని పేర్కొన్నారు.
కృష్ణ జీవితాంతం తన అభిమానులకు అండగా నిలిచారని, ఎంతోమంది పేదలకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఆయన తనయుడు మహేష్ బాబు కూడా ఆరోగ్య సేవలలో ప్రజలకు వినూత్న సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి ప్రజల మనసులో స్థానం సంపాదించారని గుర్తు చేశారు.
ఈ అవార్డు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సుధా స్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ అంశంపై చొరవ చూపాలని కోరినట్టు తెలిపారు.
సదస్సులో ఐదు రాష్ట్రాల నుండి వచ్చిన కృష్ణ, మహేష్ అభిమానులకు ప్రత్యేక అవార్డులు బహుకరించారు. పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమం హృద్యంగా కొనసాగింది.







