

రైస్ మిల్లుల కస్టోడియన్ అధికారులు అప్రమత్తతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, కస్టోడియన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.
ధాన్యం సేకరణలో అవకతవకలు జరగకుండా, రైస్ మిల్లులలో ధాన్యం భద్రపరిచే బాధ్యత కస్టోడియన్ అధికారులదేనని కలెక్టర్ చెప్పారు. వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టలతో జాగ్రత్త చేయాలన్నారు. రైస్ మిల్లులకు వచ్చే ధాన్యం పక్కదారి పట్టకుండా నిఘా నేత్రాలతో పర్యవేక్షించాలన్నారు. ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఆన్ లైన్ లో నవీకరించాలన్నారు. అదే క్రమంలో మిల్లులకు వచ్చే ధాన్యాన్ని ఆడించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు, సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కస్టోడియన్ అధికారులు ప్రతిరోజు వారికి కేటాయించిన రైస్ మిల్లుల వద్దకు వెళ్లి ఫోటో తీసి పంపాలన్నారు. మిల్లులపై పూర్తి పర్యవేక్షణ కస్టోడియన్ అధికారులదేనన్నారు. ధాన్యంలో తేమ శాతం సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం సేకరణలో సమస్యలు వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1967, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్: 7702806804కు కాల్ చేసేలా రైతులను చైతన్య పర్చాలన్నారు. రైతులకు సరిపడా టార్పాలిన్ పట్టలు, గోనె సంచులు ఉన్నాయన్నారు. ప్రతి రైస్ మిల్లు వద్ద, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద టోల్ ఫ్రీ నెంబర్, కంట్రోల్ నెంబర్లను నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ బాపట్ల జిల్లాలో కొనసాగుతోందన్నారు. పౌర సరఫరాల శాఖ ఉప తహసిల్దారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. పారదర్శకతతో ధాన్యం సేకరణ జరుగుతుందన్న విషయాలను రైతులకు తెలియపర్చాలన్నారు. ఉచితంగా రవాణా సౌకర్యం, టార్పాలిన్ పట్టలు, గోనె సంచులు ఇస్తున్న విషయాలపై అవగాహన కల్పించాలని ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డి ఎస్ ఓ జమీర్ బాషా, పవర్ సరఫరాల జిఎం శ్రీలక్ష్మి, కస్టోడియన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







