
బాపట్ల :26-11-25:-ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల నుంచి బ్యాంకు పూచికతలు తప్పనిసరి అని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ, పౌరసరఫరా సంస్థ అధికారులు, తహసిల్దారులతో వీడియో హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఈ వ్యవహారంపై కీలక సూచనలు జారీ చేశారు.ధాన్యం కోత సమయంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 74 రైస్ మిల్లులు ఉండగా, అన్ని మిల్లర్లూ బ్యాంకు పూచికతలు సమర్పించడం తప్పనిసరి అన్నారు. రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా సుమారు రూ.200 కోట్లు పూచికతలు రావాలని ఆదేశించారు.
ప్రతి రైస్ మిల్లులో తేమ కొలిచే యంత్రాలు తప్పనిసరిగా ఉండాలని, అధికారులంతా చిత్తశుద్ధితో పనులు నిర్వహించాలని కలెక్టర్ హెచ్చరించారు. “జీతాలు తీసుకుంటున్నామన్న మనస్తత్వం ఉన్నా సరే, ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం అంగీకారించేది లేదు” అని స్పష్టం చేశారు. సేకరణలో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరికా సంకేతాలు ఇచ్చారు.రైతులకు మేలు జరిగేలా సేకరణ ప్రక్రియను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కమిటీల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అమీర్ బాషా, పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్ శివ పార్వతి, ఆర్డీవోలు, తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.







