
బాపట్ల:డిసెంబర్ 10:-జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, కొనుగోలు కేంద్రాల్లో అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగే గ్రామాల సంబంధిత వ్యవసాయ సహాయకులు, పౌర సరఫరాల ఉప తహసిల్దార్లు, మండల తహసిల్దార్‌లకు అవార్డులు మరియు ప్రత్యేక సన్మానాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ప్రకటించారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ధాన్యం కొనుగోలు భారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం కోతకు ముందే అధికారులు గ్రామాలను సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేల్లో విక్రయించేలా చైతన్యపరచాలని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
డాక్టర్ వినోద్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ, డిసెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో 4,329 మంది రైతులు 23,520 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కేల ద్వారా విక్రయించారని, దీనికి ప్రభుత్వం రూ.56 కోట్ల చెల్లింపు చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 10.63 లక్షల గోనె సంచులను కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో మరింత వేగం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ధాన్యం కొనుగోలులో విశేషంగా పనిచేసిన అధికారులకు అరుదైన సన్మానాలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







