సికింద్రాబాద్, సెప్టెంబర్ 22: వరుస వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట CPI నేతలు ఇవాళ బహిరంగ ధర‍్ణా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “తీవ్ర వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇళ్లకు నీరు చేరింది. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం శోచనీయమైన విషయం,” అని విమర్శించారు.
నష్టపోయిన ప్రతి పేద కుటుంబానికి కనీసం ₹25,000 నష్టపరిహారం అందించాలని, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తక్షణ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ధర్నాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ కష్టాలు విన్నవించారు. CPI నాయకులు ప్రభుత్వం తక్షణ స్పందన లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.