
అమరావతి :15-10-25:-భారత రైల్వే చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి సమీపంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ప్రపంచ స్థాయి నగర నిర్మాణ దిశలో ఇది కీలక మైలురాయి కానుంది.
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా, న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, లండన్‌లోని సెయింట్ పాంక్రాస్ స్టేషన్ తరహాలో డిజైన్ చేయబడుతున్న ఈ స్టేషన్.. 1,500 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లనుంది. విమానాశ్రయాన్ని తలపించేలా అభివృద్ధి చెందబోతున్న ఈ స్టేషన్ లో 24 ప్లాట్‌ఫామ్స్, 4 టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణించగలగడం విశేషం.ఈ విప్లవాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం భారీగా మొగ్గు చూపింది. సుమారు రూ. 2,245 కోట్లు వెచ్చించి ఈ అత్యాధునిక రైల్వే హబ్‌ను అభివృద్ధి చేయనుంది. ఇది ఒకవైపు రాష్ట్రానికి మోడరన్ కనెక్టివిటీని అందించగా, మరోవైపు దేశవ్యాప్తంగా ఏపీకీ ఓ కొత్త గుర్తింపునిచ్చే అవకాశముంది.







