
Amaravathi:05-11-25:-రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్న పర్యాటక, పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ నారాయణ ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. మూడు రోజులుగా దుబాయ్‌లో కొనసాగుతున్న ఆయన పర్యటనలో పెట్టుబడిదారులతో పలు కీలక సమావేశాలు జరుగుతున్నాయి.ఇవాళ మంత్రి నారాయణ బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (Tecton) ఇంజినీరింగ్, అరబ్-ఇండియా స్పీసెస్ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య సేవల రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బీఆ సంస్థ ప్రతినిధులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు.
అలాగే విద్యుత్, ఆయిల్, గ్యాస్, వాటర్ ప్రాజెక్టుల నిర్మాణంలో పేరుగాంచిన టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీతో, ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఎగుమతిలో రెండో స్థానంలో ఉన్న అరబ్-ఇండియా స్పీసెస్ సంస్థతో కూడా మంత్రి సమావేశమై పెట్టుబడులపై చర్చించనున్నారు.ఏపీలో పెట్టుబడుల కోసం సానుకూల వాతావరణం నెలకొన్నదని వివరించి, ఆయా సంస్థల చైర్మన్‌లను రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఆహ్వానించనున్నారు.మంత్రి నారాయణ ఈ రాత్రి దుబాయ్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు.







