
Ntr vijayawada:28-10-25;-అందిన సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా వివరాల ప్రకారం తుఫాన్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3-4 గంటలు అత్యంత కీలకమైన సమయంగా అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటడానికి సుమారు 6 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ‘మొంథా’ తుఫాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది
ప్రభావిత జిల్లాలు:
కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లు.రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల మేరకు ఈ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అధికారులు ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.







