

దిత్వా తుపాను హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.
అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి మండలం, కొరిశపాడు మండలాలలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల రెవిన్యూ గ్రామం పరిధిలోని తిమ్మనపాలెం గ్రామ చెరువును ఆయన పరిశీలించారు. 95% నిండుగా చెరువు ఉండడంతో భారీ వర్షాలకు చెరువు కట్ట తెగకుండా ముందస్తుగా బలోపేతం చేయాలన్నారు. చెరువు లోపలకు నీటి ప్రవాహం వచ్చే మార్గంలో పూడికితీత యుద్ధ ప్రాతిపదికను తొలగించాలన్నారు. వర్షాలకు చెరువు నిండితే వెలుపలకు వెళ్లే మార్గం సరి చేయాలన్నారు. జాతీయ రహదారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన అద్దంకి మండలం దేనువకొండ గ్రామాన్ని కలెక్టర్ పరిశీలించారు. అద్దంకి మండలం గాజులపాలెం సచివాలయాన్ని తనిఖీ చేశారు. విపత్తు నిర్వహణ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పంట కాలువలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించడానికి జెసిబి యంత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జనరేటర్లు, చెట్లు తొలగించడానికి తదితరమైన యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షపాతం నమోదైతే దేనువకొండ గ్రామంలో కొన్ని గృహాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారిని యుద్ధ ప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే దేనువకొండలో గుర్తించిన ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పునరావాస కేంద్రంలో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే విద్యుత్ దీపాలు, నీటి వసతి తదితరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాలపై ఆరా తీశారు. ఏయే ప్రాంతాలలో వరద నీరు వస్తుందని అంశాలపై సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత తుపాను సమయంలో గుండ్లకమ్మ నదికి 90 క్యూసెక్కుల నీరు వచ్చిందని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే చిలకలేరు, దోర్నపువాగులు పొంగి పొర్లిపారే అవకాశం ఉందని, ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. చెరువుకొమ్మపాలెం చప్టా వద్ద వర్షపు నీరు అధికంగా వచ్చే అవకాశం ఉందని, సమీప ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

అద్దంకి పట్టణంలో నీరు నిలిచే కాలనీలలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వీఆర్వోలు, వీఆర్ఏలను ఆయా చెరువులు, కాల్వల చప్టాలు, గట్ల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. చెరువు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, సమీపంలోని ప్రజలను చైతన్యపరిచడం, అప్రమత్తంగా ఉంచాలని ఆయన సూచించారు. అనంతరం ముంపునకు గురయ్యే బాధిత కుటుంబాలకు పునరావాస కాలనీలో నివాస స్థలాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు కలెక్టర్ కు విన్నవించారు.
ఆయన వెంట చీరాల ఆర్డిఓ టి చంద్రశేఖర్, మునిసిపల్ కమిషనర్, తహసిల్దార్ చరణ్, జల వనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు.







