
బాపట్ల : దిత్వాహ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం సంపూర్ణ సిద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సూచించారు. శనివారం జిల్లా, డివిజన్, మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, తాజా పరిస్థితులపై సమీక్ష చేపట్టారు.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాటే అవకాశముండటంతో, బాపట్ల జిల్లాపై కూడా ప్రభావం ఉండొచ్చని కలెక్టర్ హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షపాతం అధికమైతే పంటకాల్వలు గండ్లు పడే అవకాశం ఉండటంతో, అవసరమైన ఇసుక బస్తాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కల్వర్టుల వద్ద పూడికతీత పనులు నిర్వహించాలని, గుర్రపుడెక్కలను తొలగించాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువులు, కాల్వలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు లేదా స్తంభాలు దెబ్బతింటే వెంటనే స్పందించేలా విద్యుత్ శాఖను అప్రమత్తం చేశారు. తాగునీటి వనరులు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, మంచినీటి పథకాల వద్ద విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. నిత్యవసర సరుకులు నిల్వ ఉంచాలని పౌరసరఫరాల శాఖను దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టితో పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన నివేదిక అందించాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో అధికారులు తమ మొబైళ్ళు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.సమీక్షా సమావేశంలో డి ఆర్ ఓ జి. గంగాధర్ గౌడ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.







